Courier Boy Kalyan Telugu Movie Review | Nithin | Yami Gautam
టీనటులు : నితిన్‌, యామీ గౌతమ్‌, అశుతోష్‌ రాణా, నాజర్‌, రవి ప్రకాష్‌, రాజేష్‌, హర్షవర్ధన్‌, సప్తగిరి, సురేఖావాణి తదితరులు బ్యానర్‌: గురు ఫిలింస్‌, మల్టీ డైమెన్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. సంగీతం: సాయి కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సందీప్‌ చౌతా ఎడిటింగ్: ప్రవీణ్‌ పూడి సినిమాటోగ్రాఫర్: సత్య పొన్‌మార్‌ నిర్మాతలు : గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మా ఘంటాల, సునీత తాటి కథ-కథనం-మాటలు-దర్శకత్వం: ప్రేమ్‌సాయి సెన్సార్ సర్టిఫికేట్ : యు/ఎ నిడివి : 104 నిమిషాలు విడుదల తేదీ: సెప్టెంబర్‌ 17, 2015 ‘ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే, చిన్నదాన నీకోసం’ వంటి వరుస చిత్రాలతో దూకుడు మీదున్న నితిన్ తాజా చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. గౌతమ్ వాసు దేవ్ మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా అప్పుడెప్పుడో ప్రారంభమైన చిత్రం రెండు సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎట్టకేలకు ఈ వినాయక చవితికి రిలీజ్ అయింది. డిఫరెంట్ కథతో కొరియర్ బాయ్‌లా ముందుకొచ్చిన నితిన్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో సమీక్షలో చూద్దాం... కథ : బీఏ డిస్‌కంటిన్యూ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసే (నితిన్) కళ్యాణ్‌గా ఈ చిత్రంలో పరిచయమౌతాడు. వస్త్ర దుకాణంలో సూపర్ వైజర్‌గా పనిచేసే పాత్రలో (యామి గౌతమ్) కావ్య పరిచయమౌతుంది. కావ్యను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిన కళ్యాణ్... కావ్య కోసం కొరియర్ బాయ్‌గా జాయిన్ అవుతాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అశుతోష్ రాణా నటించాడు. ఫారిన్‌‌లో మెడికల్ సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకున్న డాక్టర్‌ అశుతోష్ రాణా... స్టెమ్ సెల్స్ ద్వారా ఎలాంటి వ్యాధులకైనా చికిత్స చేయవచ్చు అనే అంశంపై పరిశోధన చేసి సక్సెస్ అవుతాడు. దానికోసం ఇండియాలోని ప్రధాన నగరాల్లోని పెద్ద హాస్పటల్‌లో డాక్టర్లతో చేయి కలిపి ప్రెగ్నెంట్లను టార్గెట్ చేసి వారి నుంచి ఫీటల్ స్టెమ్ సెల్స్ తీసుకుని వారికి ఆబర్షన్ అయ్యేలా చేస్తారు. ఇది తెలుసుకున్న గుడివాడ హాస్పటల్ వార్డు బాయ్ సామాజిక కార్యకర్తగా ప్రజల పక్షాన ఉండే (నాజర్) సత్యమూర్తికి ఈ విషయాల్ని తెలియజేస్తూ తగిన ఆధారాలతో కొరియర్ చేస్తాడు. ఆ కొరియర్ సత్యమూర్తికి చేరకుండా ఉండటానికి అశుతోష్ రాణా చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నంలో కొరియర్ బాయ్ కళ్యాణ్ ఆ విషయాన్ని తెలుసుకుని వారి బారినుంచి ప్రజలను ఎలా కాపాడతాడు అనేది ఈ చిత్ర ప్రధానంశం. నటీనటుల పనితీరు : నటన విషయానికొస్తే నితిన్ అతని మునిపటి చిత్రాల మాదిరిగానే తన నటనతోనే కాక లవర్ బాయ్‌గా చలాకీగా నటించి అదరగొట్టాడు. కొరియర్‌బాయ్‌గా అందర్ని అలరించాడు. యామి గౌతమ్ తన నటనతో పాటు గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నితిన్‌కు అక్క, బావగా సురేఖ వాణి, హర్షవర్ధన్ వారి పాత్రలకు తగ్గట్టుగానే నటించారు. నితిన్ స్నేహితుడిగా, కొరియర్ బాయ్‌గా నటించిన రాజేష్ అలాగే హాస్పటల్ వార్డు బాయ్‌గా వాసు ఇంటూరి, సామాజిక కార్యకర్తగా నాజర్‌లు వారి పాత్రలకు న్యాయం చేశారు. చివరగా విలన్‌గా నటించిన అశుతోష్ రాణా ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. సాంకేతిక నిపుణుల పనితీరు : ప్రభుదేవా వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన ప్రేమ్ సాయి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. కథ విషయంలో మాత్రం కొత్తగా చూపించి కాస్త ఫర్వాలేదనిపించాడు. రొమాంటిక్ లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ప్రేమ్ సాయి కథనం విషయంలోనూ కొంచెం పొదును పెడితే బాగుండేది. నితిన్, యామిగౌతమ్‌తో ఓ బోరింగ్ ప్రేమకథకు రొమాంటిక్ ట్రాక్ ఎక్కించాడు. కార్తీక్ మ్యూజిక్‌‌లో ఒకటి, రెండు తప్ప గుర్తు పెట్టుకోదగ్గ పాటలు లేవు. కానీ సందీప్ చౌతా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదనిపించింది. సెకండ్ హాఫ్‌లో అనుప్ రూబెన్స్ సంగీతం అందిచిన పాట కూడా చాలా బాగుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మాణంలో జాప్యం జరిగినా క్వాలిటీ విషయంలో మాత్రం రాజీపడలేదనిపించింది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ సూపర్బ్. కొన్ని కొన్ని సన్నివేశాలు, పాటలలో విజువల్స్ చాలా బాగున్నాయి. విశ్లేషణ : ఈ సినిమాకోసం చాలా చిన్న (మేజర్) పాయింట్ తీసుకున్న దర్శకుడు ప్రేమ్ సాయి కథనంలో కూడా మెరుగ్గా ఉంటే బాగుడేంది. కొన్ని విషయాల్లో ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించలేకపోయారు. ఫస్టాఫ్ అంతా కథతో సంబంధం లేని లవ్ ట్రాక్ నడిపాడు. సెకండాఫ్‌లో ల్యాగ్ ఎక్కువై కొద్దిసేపు ఆసక్తికరంగా నడిచినా.. క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా ఆకస్మాత్తుగా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా నిడివి చాలా తక్కువగా ఉన్నందున దర్శకుడు తను చెప్పాలనుకున్న కథను సూటిగా చెప్పాల్సింది. దర్శకత్వం పరంగా అక్కడక్కడా ప్రేమ్ సాయి ప్రతిభను చూడొచ్చు. స్ర్కీన్‌ప్లే విషయంలో దెబ్బతిన్నాడనే చెప్పాలి. కొరియర్ డెలివరి విషయంలో ఆలస్యం చేసిన దర్శకుడు దాన్ని రుజువు చేసుకోలేకపోయాడు. చివరగా కొరియర్ బాయ్‌గా కళ్యాణ్‌కు డిఫరెంట్ కథతో వచ్చిన రొటిన్ సినిమాగా ఈ చిత్రం నిలిచిపోతుంది. రేటింగ్ : 2.75/5
Rating: threestar