బాబూ! జాగ్రత్తమ్మా! ఏ అమ్మాయినీ 14 సెకన్లపాటు చూడకు...
కొచ్చి : కుర్రాళ్ళోయ్... కుర్రాళ్ళూ... కళ్ళేలే లేనోళ్ళూ... కైపెక్కి ఉన్నోళ్ళు... అసలు కుర్రాళ్ళనే ఎందుకు అనుకోవాలి? ఈ రోజుల్లో ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోవడానికి కారణం కుర్రాళ్ళు మాత్రమే కాదు పెద్దోళ్ళూ అని అందరికీ తెలిసిందే. కొందరిలో అదుపుతప్పిన కామవాంఛలవల్ల ఎందరో అమాయక బాలికలు, యువతులు, మహిళలు బాధితులైపోతున్నారు. ఈ విషయంలో స్త్రీ,పురుష భేదం లేకుండా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేరళకు చెందిన ఎక్సయిజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ మనసు కూడా ఆవేదనతో రగిలింది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సలహాలు ఇచ్చారు. దుర్మార్గుల నుంచి ఎలా తప్పించుకోవాలో చిట్కాలు చెప్పారు. హద్దు మీరినవాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న చట్టాల గురించి కూడా వివరించారు. ఎవరైనా అబ్బాయి ఓ అమ్మాయిని తదేకంగా 14 సెకన్లపాటు చూస్తే కేసు పెట్టవచ్చునని రిషిరాజ్ చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఇటువంటి కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. మహిళలను అసభ్యంగా తాకినా, అమర్యాదకరంగా మాట్లాడినా, వెనకనుంచి వెంటబడుతున్నా కేసు పెట్టవచ్చునని తెలిపారు. అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. రిషిరాజ్ సలహాలను చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. కేరళ క్రీడల మంత్రి జయరాజన్ మాట్లాడుతూ చట్టాల గురించి రిషిరాజ్ తెలుసుకుంటే మంచిదని చెప్పారు. 14 సెకన్లు చూస్తే కేసు పెట్టవచ్చునని ఆయన ఎలా చెప్తున్నారో తెలియడం లేదన్నారు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే ఎలా గుర్తించాలని ప్రశ్నించారు.
Rating: fivestar