ప్రతీ కొడుకూ చదవాల్సిసిన లేఖ!
ప్రముఖ తమిళ గీత రచయిత నా.ముత్తుకుమార్‌ కామెర్ల వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఈయన కొన్ని రోజుల క్రితం తన తొమ్మిదేళ్ల కొడుక్కి ఓ భావోద్వేగపూరితమైన లేఖ రాశారు. ఆ లేఖ అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ లేఖ సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. ఇది ప్రతి తండ్రీ, కొడుకూ తెలుసుకోవలసిన విషయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ప్రియమైన కుమారుడికి నాన్న రాస్తున్న తొలి లేఖ. దీనిని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు. భాష వేళ్లు పట్టుకుని ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నావు. మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే.. కొన్ని రోజుల తర్వాత నువ్వూ వెతుకుతావు. జీవితపు లోతుల గురించి తెలుసుకోవాలంటే ఎక్కువగా ప్రయాణాలు చెయ్‌. అవి ఎన్నో అనుభవ పాఠాలు నేర్పుతాయి. పుస్తకాలు చదువు. ఒక్కో పుస్తకం.. ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మీ తాత, నాన్న పుస్తక ప్రపంచంలోనే కనుమరుగయ్యారు. నీలోనూ ఆ రక్తమే ప్రవహిస్తోంది. దక్కిన పని కంటే.. నచ్చిన పని చెయ్యడం వల్ల జీవితం ఆనందమయమవుతుంది. ఎవరైనా సహాయం కోరితే.. ఎన్ని కష్టాలు పడైనా సహాయపడు. అందులో లభించే తృప్తి అనిర్వచనీయమైనది. బంధువులతో సన్నిహితంగానూ ఉండు.. దూరంగానూ ఉండు. ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే విలువైనది స్నేహం. మంచి వ్యక్తులతో స్నేహం చెయ్‌. ఇవన్నీ మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. నేను నీకు చెప్పదలచి చెబుతున్నవి. నీవు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను అర్థం చేసుకోగలిగాను. రేపు నీకో కొడుకు పుడితే నా ప్రేమానురాగాలు నీకు అప్పుడు అర్థమవుతాయి. భవిష్యత్తులో నీ మనవళ్లతో ఆడుకునే సమయంలో నేను గుర్తుకొస్తే.. ఈ లేఖను ఓ సారి తీసి చూడు.. నీ కంటి నుంచి కారే కన్నీటిలో నేనుంటా. ఇట్లు, మీ నాన్న, నా. ముత్తుకుమార్‌’
Rating: fivestar